సహవాసం అనగా మనము ఇతరులతో కలిగియుండే ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన సంబంధము. ఈ భూమి మీద ఉన్న నిజ క్రైస్తవులు అందరూ ఒకరితో ఒకరు సహవాసము కలిగియుండి, విశ్వాసులని పిలువనడునట్లు దైవ బాంధవ్యాన్ని కలిగిఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తువారిలో మనకున్న గొప్ప విశ్వాసమే మనలను తండ్రితోను, ఇతర విశ్వాసులతోను సంపూర్ణ సహవాసము కలిగియుండునట్లు చేస్తుంది. భూమి మీద ఎన్ని సంఘములు ఉన్నను, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనమంతా ఒక్కటే కుటుంబమై యున్నాము. కనుక మనలో ఒకరిమధ్య ఒకరికి దైవిక మరియు ఆత్మీయ సహవాసము తప్పక ఉండాలి. యోహాను 13:34-35 లో యేసు ఇలా చెప్పారు, మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
మనము ఒకరితో ఒకరము సమాధానంగా ఉండుటకును, దైవిక ప్రేమ కలిగియుండుటకును, అనురాగము కలిగియుండుటకును, ప్రోత్సాహపరుచుకొనుటకును యేసు క్రీస్తు వారు రక్తమిచ్చి సంఘముగా మనలను ఏర్పరచెను కానీ ద్వేషించుటకు, అల్లరులుకు, దైవ వ్యతిరేక క్రియలను, పోకిరి చేష్టలకు, అల్లరి సంబంధమైన ఆట పాటలకు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుటకు ఎంతమాత్రం కానే కాదు. క్రీస్తు శిరస్సు అయి ఉండగా, సంఘం ఈ భూమిమీద ఆయన శరీరముగా ఉన్నది. కనుక ఈ శరీరమును దాని విలువను పాడుచేసే అవయవములుగా కాక, సాటి క్రైస్తవులను, సంఘములను,ప్రేమించుచు మంచి సహవాసముగల వారమై యుందుము. యేసుక్రీస్తును విశ్వసించని లోకములో ఉన్న ఇతర మనుష్యులపై కూడా క్రీస్తు ప్రేమను చూపి, చక్కని సహవాసమును కలిగియుందుము. సర్వశక్తిమంతుడైన తండ్రి, పరిశుద్ధాత్మ వలన మనలను ప్రేరేపించి , యేసు వారి పవిత్ర నామమున మనకు అట్టి సహవాసపు మనసు దయచేయును గాక - ఆమెన్.
- Glp Rajesh Babu

Comments
Post a Comment